India vs New zealand ODI Series: రెండో వ‌న్డేలోనూ విజ‌యం సాధించిన భార‌త్‌.. సిరీస్ కైవ‌సం

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 09:37 PM

India vs New zealand ODI Series: రెండో వ‌న్డేలోనూ విజ‌యం సాధించిన భార‌త్‌.. సిరీస్ కైవ‌సం

India vs New zealand ODI Series: ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ శ‌నివారం రాయ్‌పుర్‌లో జ‌రిగింది. ఈ వ‌న్డేలో టీమిండియా కివీస్‌ను చిత్తుచేసింది. ఫ‌లితంగా ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. భార‌త్ బౌల‌ర్లు నిప్పులు చెరిగే బంతుల‌తో కివీస్ బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టారు. కివీస్ బ్యాట‌ర్ ఏ ఒక్క‌రూ క్రిజ్‌లో కుదురుకోకుండా వ‌రుస వికెట్లు తీయ‌డంతో 108 ప‌రుగుల‌కే కివీస్ ఆలౌట్ అయింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవ‌లం రెండు వికెట్లు కోల్పోయి 20.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించారు. ఫ‌లితంగా మూడు వ‌న్డేల సిరీస్‌ను టీమిండియా మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో కైవ‌సం చేసుకుంది. మూడో వ‌న్డే మంగ‌ళ‌వారం (జ‌న‌వ‌రి 24న‌) ఇండోర్‌లో జ‌రుగుతుంది.

 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. ఆది నుంచి టీమిండియా బౌల‌ర్లు నిప్పులుచెరిగే బంతుల‌తో కివీస్ బ్యాట‌ర్ల‌ను హ‌డ‌లెత్తిచ్చారు. మ‌హ్మ‌ద్ ష‌మీ వేసిన తొలిఓవ‌ర్లోనే కివీస్ జ‌ట్టు ఖాతా తెర‌వ‌కుండానే వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ ఫిన్ అలెన్ డ‌కౌట్ అయ్యాడు. కొద్దిసేప‌టికే సిరాజ్ బౌలింగ్‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన హెన్రీ నికోల్స్ (2) ఔట్‌ అయ్యాడు. డెహాన్ కాన్వే(7), డారిల్ మిచెల్ (1), టామ్ లేథ‌మ్(1) వ‌రుస‌గా పెలివియ‌న్ బాట‌ప‌ట్ట‌డంతో 10 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 15 ప‌రుగుల‌కే కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రాస్ వెల్‌(22), మిచెల్ శాంట‌ర్న్ (27)లు భాగ‌స్వామ్యం నెల‌కొల్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ భార‌త్ బౌల‌ర్ల దాటికి ఎక్కువ‌సేపు క్రిజ్‌లో నిల‌వ‌లేక పోయారు. ఫ‌లితంగా 108 ప‌రుగుల‌కే కివీస్ జ‌ట్టు ఆలౌట్ అయింది. భార‌త్ బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు తీయ‌గా, హార్డిక్ పాండ్యా, వాసింగ్ట‌న్ సుంద‌ర్ చెరో రెండు వికెట్లు, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌, కుల్ దీప్ యాద‌వ్ ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

109 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ రాణించారు. దీంతో రోహిత్ శ‌ర్మ (51) ఆఫ్ సెంచ‌రీ చేయ‌గా, విరాట్ కోహ్లీ (11) ఔట్ అయ్యాడు. శుభ్‌మ‌న్ గిల్ (40 నాటౌట్‌), ఇషాన్ కిష‌న్ (8 నాటౌట్‌) కివీస్ నిర్దేషించిన ల‌క్ష్యాన్ని ఛేధించారు. కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 20.1 ఓవ‌ర్ల‌లో టీమిండియా 111 ప‌రుగులు చేసింది. కివీస్ బౌల‌ర్లు షిప్లే, శాంట‌ర్న్ ఒక్కోవికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో టీమిండియా మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.