IND vs NZ 1st T20 Match: తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం

IND vs NZ 1st T20 Match: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో విఫలం కావటంతో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పొయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వరుస వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (47), వాషింగ్టన్ సుందర్ (50) మినహా మిగిలిన ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. చివరిలో సుందర్ మెరుపు వేగంతో ఆఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు డేవాన్ కాన్వే (52), ఫిన్ అలెన్ (35) మొదటి వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫిన్ అలెన్ ఔట్ కాగానే క్రీజ్‌లోకి వచ్చిన చాప్‌మెన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ వేసిన ఐదో ఓవర్లో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ (17) స్వల్ప పరుగులకే కుల్ దీప్ యాదవ్ బౌలింగ్ లో పెవిలియన్ బాటపట్టాడు. డారిల్‌మిచెల్ క్రిజ్‌లో పాతుకుపోయాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన మిచెల్ 59 పరుగులు చేశాడు. డేవాన్ కాన్వే ఔట్ అయిన తరువాత మిగతా కివీస్ బ్యాటర్లు ఎవరూ క్రీజ్‌లో కుదురుకోలేక పోయారు. అయితే, అర్ష్ దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లలో ఏకంగా 27 పరుగులు రావటంతో న్యూజిలాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు వాసింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా, అర్ష్ దీప్ సింగ్, కుల్ దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీశారు.
177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టుకు ఆదిలోనే తొలి వికెట్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. జాకబ్ వేసిన తొలి ఓవర్‌లో చివరి బంతికి ఇషాన్ కిషన్ (4) ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. వన్డేల్లో పరుగుల వరదపారించి సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (7) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. ఆ తరువాత క్రిజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్యా (21) పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ చివరిలో మెరుపు ఆఫ్ సెంచరీ చేశాడు. అప్పటికే ఓవర్లు పూర్తికావటంతో భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ బ్రావెల్, సాట్నర్, ఫెర్గూసన్‌లు తలా రెండు వికెట్లు తీశారు. డారిల్ మిచెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.