హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

Kaburulu

Kaburulu Desk

April 1, 2024 | 12:01 PM

హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

యువతీ యువకులను ప్రస్తుతం కలవరపెడుతున్న సమస్య జుట్టు రాలిపోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం, వాడే షాంపోలు, జన్యుపరమైన సమస్యలు జుట్టు రాలిపోవడానికి కారణాలు కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. మరి దీనిని ఎలా నివారించుకోవాలి.. ఏ పద్దతులు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రమాదాల నుంచి వాహనదారులు రక్షణ పొందడానికి హెల్మెట్ వాడకం తప్పనిసరయ్యింది. రోజు ప్రయాణాలు చేసే వారు హెల్మెట్ ఎక్కువ సేపు ధరించడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతోంది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చెమట ఎక్కువగా రావడం, బాక్టీరియా, నాణ్యతలేని హెల్మెట్లు వాడటం వల్ల ఈ సమస్య ఎక్కువైపోతుంది. మరి దీని నివారణకు ఏం చేయాలో తెలుసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

హెల్మెట్ వాడే వాహనదారులు జుట్టు రాలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. ఎల్లప్పుడు నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. ఇది ప్రమాదాలు జరిగినపుడు రక్షిస్తుంది. జుట్టు రాలకుండా నివారిస్తుంది.

2.తల స్నానం చేసిన తరువాత జుట్టు పూర్తిగా పొడిబారిన తరువాతే హెల్మెట్ పెట్టుకోవాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే చుండ్రు, దురద సమస్య ఎక్కువై జుట్టు రాలుతుంది.

3. తలకు హెల్మెట్ ధరించేటప్పుడు జుట్టు పై నుంచి ఖర్చీఫ్ లాంటి వస్త్రాన్ని కట్టుకోవడం మంచిది. దీంతో హెల్మెట్ లోపలి భాగం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

4.నిత్యం వాడే హెల్మెట్ లోపలి వైపు ఉండే కుషనింగ్ మీద ఉన్న మురికిని శుభ్రపర్చుకోవాలి.

5.హెల్మెట్ వాడనపుడు గాలి తగిలే చోటకాని, ఎండలో గాని ఉంచినట్లైతే హెల్మెట్ లోపల ఫంగస్ ఏర్పడకుండా ఉంటుంది. దీంతో జుట్టుకు ఎలాంటి హాని జరుగదు.

6.హెల్మెట్ తల నుంచి తీసేటపుడు లాగకుండా నెమ్మదిగా తీయాలి. దీని వల్ల హెల్మెట్ కు అతుకున్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.

7. మహిళలు కూడా హెల్మెట్ ధరించేటపుడు వదులు జడ వేసుకుంటే జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు.

వీటన్నింటితో పాటూ తరచుగా నూనెతో తల మర్దనా చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానం చేసే ముందు కలబంద గుజ్జు లేదా అలోవెరా జెల్ తలకు రాసుకోవాలి. దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది. మనం ఆహారంగా తీసుకునే పోషక పదార్థాలు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తింటే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే గింజలు.. దీంతో పాటు నిమ్మకాయలు, నారింజ పండ్లు తీసుకోవటం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. పౌష్టికాహారంతో పాటుగా రోజువారీ వ్యాయామం, విశ్రాంతి, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడతాయి.