Smart Phones: మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

Kaburulu

Kaburulu Desk

April 1, 2024 | 11:45 AM

Smart Phones: మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

నేటికాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లను  తెగ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుండా క్షణం గడపలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు..దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో. పెద్ద వారి విషయం పక్కన పెడితే ఏడాది పిల్లలు మొదలుకుని పెద్ద పిల్లల వరకు అందరూ ఫోన్లు చూసే వారే. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా కనీసం ముద్ద కూడా తినరు. మనం వారి నుంచి ఫోన్ తీసేసుకుంటే.. తిరిగి ఇచ్చే వరకు వారు ఏడుపు ఆపరు. ఇలా ఎవరి పిల్లలైన ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారంటూ ఓ వ్యాధి సోకిందని  అనుమానించాల్సిందే. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలకు అసలు ఫోన్ అలవాటు చేసింది పెద్దలే. పిల్లలు తినకపోయినా, అల్లరి చేస్తున్నా, ఇంటికి అతిథిలు వచ్చినప్పుడు గోల చేయకుండా మొబైల్ ఫోన్లు అందజేస్తారు. పిల్లలకు కథలు చెప్పే బదులు ఫోన్లలో కథలు చూడమని తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు. నిత్యం వివిధ పనుల్లో బిజీగా ఉండే తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లలతో ఆడుకునే సమయం ఉండదు. కొన్ని ఇళ్లలో ఉండేది కూడా ముగ్గురే కావడంతో  పిల్లలతో ఆడుకోవడానికి ఎవరూ ఉండరు. దీంతో పిల్లలు ఫోన్లు, టీవీలకు అలవాటుపడిపోతున్నారు.

కొందరు పిల్లలు ఫోన్లు ఆపరేటింగ్ చేస్తుంటే.. అదేదో గొప్ప విషయంలా తల్లిదండ్రులు, తాతయ్యలు గర్వంగా చెప్పుకుంటారు. ఈ గాడ్జెట్ ఎంత వినోదాత్మకంగా ఉందో, మీ పిల్లల ఆరోగ్యానికి రెండు రెట్లు హానికరం. నిత్యం ఫోన్లు, టీవీలు చూసే చిన్నారులకు కంటిచూపు సమస్య వస్తుంది. కేవలం అది ఒక్క సమస్యే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. టీవీలు, ఫోన్లు ఎక్కువ సమయం  చూసే పిల్లలు వర్చువల్ ఆటిజం బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నాలుగు , ఐదు ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే పరిస్థితి వర్చువల్ ఆటిజం అంటారు. మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ లను ఎక్కువగా వాడటం వల్ల పిల్లలకు ఈ సమస్య వస్తుందంట.

ఈ పరిస్థితి ఉన్న పిల్లలు ఇతర వ్యక్తులతో మాట్లాడటం, సంభాషించడం చేయరు. ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ఈ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వర్చువల్ ఆటిజంకు స్పష్టంగా స్పష్టమైన లక్షణాలంటూ ఏమి చెప్పలేము. ఈ వ్యాధి కలిగిన  పిల్లలు దూకుడు ప్రవర్తన కలిగి ఉంటారు. మొబైల్ ఫోన్‌లో అరగంట తర్వాత కూడా అశాంతికి గురవుతారు. ఏకాగ్రత,. నిద్రలేమి సమస్యలు వేధిస్తూ ఉంటుంది. స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ థెరపీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ థెరపీ ద్వారా  వర్చవల్ ఆటిజం ఉన్న పిల్లలను మాములు స్థితిలోకి తెచ్చే ప్రయత్నాలు చేయవచ్చు.