TCongress: ఫిబ్రవరి 6 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర.. మరి కాంగ్రెస్ నేతలంతా కలిసొస్తారా?

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 09:44 PM

TCongress: ఫిబ్రవరి 6 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర.. మరి కాంగ్రెస్ నేతలంతా కలిసొస్తారా?

TCongress: తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుంది. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలు పెట్టనున్నట్లు రేవంత్ చెప్పారు.

వాస్తవానికి జనవరి 26 కాశ్మీర్లో రాహుల్ గాంధీ యాత్ర ముగిస్తే ఆదే రోజు తెలంగాణలో యాత్ర మొదలు పెట్టాలనుకున్నారు. కానీ భద్రతా కారణాలు చూపి జనవరి 26న కశ్మీర్ లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరవేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నెల 30న కశ్మీర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్య నాయకులంతా హాజరుకానున్నారు. దాని తర్వాత ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఫిబ్రవరి 3 నుంచి సమావేశాలు, ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్ ఉండడంతో హాత్ సే హాత్ జోడో యాత్రను ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభించనున్నారు.

ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీని ముఖ్య అతిధిగా ఆహ్వానించనున్నారట. మరి వాళ్లలో ఎవరు తెలంగాణకి వస్తారన్నది చూడాల్సి ఉండగా.. అసలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కానున్నారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాగా.. ఈ మధ్యనే కోమటి రెడ్డి మళ్ళీ గాంధీ భవన్ కి వెళ్లి పీసీసీ అధ్యక్షుడితో సమావేశం కాగా.. అంతలోనే పార్టీ సీనియర్ నేత వీహెచ్ అలకపాన్పు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే యాత్ర సమయానికి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.