IND vs NZ 3rd ODI: సిరీస్ క్లీన్‌స్వీప్.. మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం ..

IND vs NZ 3rd ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలో 90 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలతో చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే ఫిన్ అలెన్ డకౌట్ అయ్యాడు. న్యూజిలాండ్ జట్టులో డేవాన్ కాన్వే (138), నికోల్స్ (42) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 41.2 ఓవర్లకు 295 పరుగులకే కివీస్ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 90 పరుగులతో భారీ విజయం సాధించింది. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దిప్ యాదవ్‌లు తలా మూడువికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు తీయగా, ఉమ్రాన్ మాలిక్, హార్దిక్ పాండ్యాలు ఒక్కో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్‌శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) శతకాలతో చెలరేగడంతో మొదటి వికెట్ భాగస్వామ్యానికి టీమిండియా 212 పరుగులు చేసింది. 112 వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్‌శర్మ ఔట్ అయ్యాడు. కొద్దిసేపటికే టీమిండియా 230 పరుగుల వద్ద గిల్ కూడా ఔట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరు ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (36), ఇషాన్ కిషన్ (17)లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. వరుసగా వికెట్లు పడటంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. సూర్యకుమార్ యాదవ్ (14),సైతం తక్కువ స్కోర్‌కే ఔట్ అయ్యాడు. టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (54) ఆఫ్ సెంచరీతో రాణించారు. వాషింగ్టన్ సుందర్(9) పరుగులకే ఔట్ అయ్యాడు.
India vs New zealand ODI Series: రెండో వన్డేలోనూ విజయం సాధించిన భారత్.. సిరీస్ కైవసం
ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్‌తో కలిసి హార్దిక్ పాండ్య భాగస్వామ్యం కొనసాగింది. అయితే, శార్దూల్ ఠాకూర్ (25) ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కొద్దిసేపటికే హార్దిక్ పాండ్యకూడా ఔట్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన కుల్‌దీప్(3) రన్‌ఔట్ కాగా, ఉమ్రాన్ మాలిక్ 2 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. కివీస్‌పై మూడో వన్డేలో టీమిండియా భారీ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డుఫీ, టిక్నర్ చెరో మూడు వికెట్లు తీశారు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ కొట్టిన శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.