IND vs NZ 3rd ODI: గెలిస్తే అగ్రస్థానంలోకి టీమిండియా.. నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చివరి వన్డే మ్యాచ్..

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 09:20 AM

IND vs NZ 3rd ODI: గెలిస్తే అగ్రస్థానంలోకి టీమిండియా.. నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చివరి వన్డే మ్యాచ్..

IND vs NZ 3rd ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే నేడు ఇండోర్‌లో జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్‌లోనూ విజయంసాధించి క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. నేడు జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది.

India vs New zealand ODI Series: రెండో వ‌న్డేలోనూ విజ‌యం సాధించిన భార‌త్‌.. సిరీస్ కైవ‌సం

టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. తొలి వన్డేలో కొంచెం తడబడ్డ భారత్ బౌలర్లు, రెండో వన్డేలో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. తక్కువ పరుగులకే కివీస్‌ను ఆలౌట్ చేశారు. యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, ఈ రోజు జరిగే మ్యాచ్‍లో షమీ, సిరాజ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చే యోచనలో కెప్టెన్ రోహిత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటుదక్కే అవకాశం ఉంది. మరోవైపు స్పిన్నర్ చాహల్‌నుసైతం తుది జట్టులో ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక ఇండోర్ స్టేడియం బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం కావటంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి.

 

నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెం.1కు చేరనుంది. ప్రస్తుతం ఇండియా టీ20 ఫార్మాట్‌లో ఐసీసీ  రాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతుంది. వన్డే ఫార్మాట్ లో మూడో స్థానంలో ఉంది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ (113 పాయింట్స్‌తో) మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఇండియా జట్లుకూడా 113 పాయింట్స్‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ జరిగే మ్యాచ్ లో కివీస్ పై ఇండియా గెలిస్తే 114 పాయింట్స్ తో అగ్రస్థానంకు చేరుకుంటుంది. న్యూజిలాండ్ మాత్రం రెండు పాయింట్లు కోల్పోయి 111 పాయింట్లతో ఆస్ట్రేలియా తరువాత నాల్గో స్థానంకు దిగజారుతుంది.