Vundavalli Aruna Kumar: టీడీపీని జగన్ భూస్థాపితం చేస్తారేమో.. టీడీపీ-జనసేన పొత్తుపై ఉండవల్లి సంచలన కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 09:02 PM

Vundavalli Aruna Kumar: టీడీపీని జగన్ భూస్థాపితం చేస్తారేమో.. టీడీపీ-జనసేన పొత్తుపై ఉండవల్లి సంచలన కామెంట్స్!

Vundavalli Aruna Kumar: ఉండవల్లి అరుణ్ కుమార్.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా.. ఇప్పటి రాజకీయాలపై విశ్లేషణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే నేత. ఉండవల్లి మీడియా ముందుకొస్తే ఇప్పటి రాజకీయాలపై ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన కూడా ఓ రేంజిలో మీడియాకి, ప్రజలకు మాట్లాడుకునేందుకు స్టఫ్ ఇచ్చేసి వెళ్తుంటారు.

ఎప్పటిలాగానే మరోసారి ఉండవల్లి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో ఎవరెవరు పొత్తులలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి.. పొత్తులు కుదరకపోతే ఎవరు గెలిచే అవకాశం ఉందో ఉండవల్లి మార్క్ విశ్లేషణలు చేశారు. ఇక.. ఆయన విశ్లేషణల సారాంశం విషయానికి వస్తే.. ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు కుదరకపోతే.. వైసీపీ టీడీపీని భూస్థాపితం చేయడం ఖాయమని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వ్యక్తి అని.. తనని సీఎం అభ్యర్ధిగా ప్రకటించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవట్లేదన్న ఉండవల్లి.. అందుకు ఒకవేళ టీడీపీ ఒప్పుకోకపోతే.. పవన్ కళ్యాణ్‌కి కొత్తగా పోయేది ఏమి లేదన్నారు. పొత్తు కుదరకపోతే.. టీడీపీని జగన్ కచ్చితంగా భూస్థాపితం చేస్తారు కనుక పవన్ కళ్యాణ్‌తో పొత్తు కావాలంటే.. చంద్రబాబే ఒక అడుగు వెనక్కి వేయాలని చెప్పుకొచ్చారు. కనుక పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే అంటే మాత్రం టీడీపీకి తప్పని పరిస్థితేనని చెప్పారు.

అయితే.. 40 సంవత్సరాల అనుభవం.. అపార చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు.. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంటుందా?.. అసలు పవన్ తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబడతారా?.. పట్టుబడితే మాత్రం టీడీపీ జనసేనకి అవకాశం ఇస్తుందా? ఇదే ఇప్పుడు ఉండవల్లి కామెంట్స్ తో రాజకీయాలలో నడుస్తున్న చర్చ. పవన్ ఇప్పటికే టీడీపీకి జై కొట్టేశారు. టీడీపీ కూడా పవన్ ను వదులుకునే అవకాశం లేదు. అయితే.. ఎవరు ఎంత తగ్గుతారు.. ఎవరికి ఎన్ని దక్కుతాయన్నదే ఇంక తేలాల్సి ఉంది. అది కాలమే తేల్చాల్సి ఉంది.