IND vs AUS Test Match: తొలిరోజు భారత్‌దే .. జడేజా, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలంకు చేతులెత్తేసిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ..

Kaburulu

Kaburulu Desk

February 9, 2023 | 11:09 PM

IND vs AUS Test Match: తొలిరోజు భారత్‌దే .. జడేజా, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలంకు చేతులెత్తేసిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ..

IND vs AUS Test Match: బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇండియా మధ్య నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ గురువారం నాగ్‌పూర్‌ వేదికగా ప్రారంభమైంది. తొలిరోజు మ్యాచ్‌లో భారత్‌ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. టీమిండియా స్పిన్‌ మాయాజాలంకు ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలిపోయింది. తొలుత టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన డెవిడ్‌ వార్నర్‌ (1), ఖవాజా(1) వెంటవెంటనే ఔట్‌ అయ్యారు. షమీ, సిరాజ్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రెండు పరుగులకే ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ (37), లబుషేన్‌ (49) ఆసీస్‌ స్కోర్‌ బోర్డును పెంచే ప్రయత్నం చేశారు. లంచ్‌ బ్రేక్‌ వరకు వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. లంచ్‌ బ్రేక్‌ తరువాత టీమిండియా బౌలర్లు విజృంభించారు.

 

జడేజా, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలంకు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేక పోయారు. స్టీవ్‌ స్మిత్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తరువాత బంతికే క్రీజ్‌లోకి వచ్చిన రేన్‌షాను ఎల్బీడబ్ల్యూ రూపంలో జడేజా పెవిలియన్‌కు పంపించాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. లబుషేన్‌ ఆసీస్‌ను కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు. రవీందర్‌ జడేజా వేసిన బాల్‌కు ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేయగా.. కీపర్‌ భరత్‌ స్టంపౌట్‌ చేశాడు. జడేజా, అశ్విన్‌ వరుస ఓవర్లువేసి ఆసీస్‌ బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్‌ బాట పట్టించారు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌లలో లుబుషేన్‌ (49), స్టీవ్‌ స్మిత్‌ (37), హ్యాండ్‌స్కోబ్‌ (31), అలెక్స్‌ క్యారీ (36) పరుగులు మినహా ఎవరూ రెండంకెల స్కోర్‌ సాధించలేదు. ఫలితంగా 63.5 ఓవర్లకు ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులు చేసింది. జడేజా ఐదు వికెట్లు తీసుకోగా, అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. షమీ, సిరాజ్‌లు చెరో వికెట్‌ తీసుకున్నారు.

 

క్రీజ్‌లోకి వచ్చిన టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కే.ఎల్‌. రాహుల్‌ ఆచితూచి ఆడుతూ ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. రోహిత్‌ తనదైన దూకుడును కొనసాగిస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. 69 బాల్స్‌లో 56 పరుగులు చేసిన రోహిత్‌ క్రీజ్‌లో కొసాగుతున్నాడు. కేఎల్‌ రాహుల్‌ 71 బాల్స్‌ ఆడి 20 పరుగులు చేశాడు. మర్ఫీ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్‌ అయ్యాడు. దీంతో 76 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. నైట్‌ వాచ్‌మెన్‌గా అశ్విన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. శుక్రవారం భారత్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తే ఆస్ట్రేలియా కష్టాలు మరింత రెట్టింపవుతాయి.