AP Ministers: కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడు.. మళ్ళీ రెచ్చిపోయిన మంత్రులు!

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 09:09 AM

AP Ministers: కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడు.. మళ్ళీ రెచ్చిపోయిన మంత్రులు!

AP Ministers: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇక్కడ పొలిటికల్ హీట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. రానున్న ఎన్నికలకు పొత్తులపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా ఈ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు కావడంతో వైసీపీ తీవ్ర విమర్శలకి దిగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుండి ఘాటు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించారు.

తాజాగా జనసేన నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో పవన్ కల్యాణ్ ఒకటి మాత్రం నిజం చెప్పాడని.. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని చెప్పాడని, అందులో వాస్తవం ఉందని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ చేతిలో ఒకసారి బడితెపూజ జరిగగా.. ఈసారి కుక్క చావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడన్నారు. రోజుకో మాట.. పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని.. దీన్ని రాజకీయ వ్యభిచారం అనరా అంటూ ప్రశ్నించారు.

అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటే పవన్ బాగా ఊగిపోతున్నాడు. ఉత్తరాంధ్రలో సత్యానంద్ వద్ద పవన్ నేర్చుకున్న విద్యే కదా ఇది. ఊగడం, ఆగడం ఆయనకు అలవాటే. చంద్రబాబుతో నీకు ఉన్నది అత్తా అల్లుడి సంబంధమో, మామా అల్లుడి సంబంధమో, దత్తతండ్రి, దత్తపుత్రుడి సంబంధమో… నీ నోటితో నువ్వే చెబుతున్నావు, మళ్లీ ఉలిక్కి పడుతున్నావు. మీ మధ్య సంబంధం ఏంటో నువ్వే చెప్పి నువ్వే మమ్మల్ని తిడితే ఎలా అని సెటైర్లు వేశారు.

పవన్‌ కల్యా ణ్‌కు మంత్రి రోజా కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెండుసార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అని మండిపడ్డారు. అయినా ప్రజల కోసం తప్పట్లేదంటూ ట్వీట్‌ చేశారు.. మరోవైపు, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పవన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అన్నారు. క్యా బాత్‌ హై అని పవన్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి అంటూ సెటైర్లు వేశారు. మొత్తం మీద పొత్తు సంగతేమో కానీ ఏపీ పొలిటికల్ హీట్ మాత్రం పీక్స్ కి చేరుతుంది.