YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 05:59 PM

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు!

YSRCP: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల మంట ఇంకా చల్లారలేదు. అంతకు ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీలలో భారీ ఓటమి దక్కించుకున్న అధికార పార్టీ వైసీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలలో కూడా భారీ షాక్ తగిలింది. తనకు బలం లేకపోయినా టీడీపీ పంచుమర్తి అనురాధను బరిలో దింపి టీడీపీ చాకచక్యంగా వ్యవహరించింది. చంద్రబాబు మరోసారి తన రాజకీయ చతురతతో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. బలం లేని చోట తన అభ్యర్థిని గెలిపించుకోవడంతో వైసీపీకి భారీ దెబ్బ పడింది.

రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడినట్లు భావిస్తున్న ఎమ్మెల్యేలపై వైసీపీ సీరియస్ డెసిషన్ తీసుకుంది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఆనం రామనారా‍యణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వైసీపీ తీవ్ర చర్యకు దిగింది.

వైసీపీ అధినాయకత్వం ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సజ్జల మీడియాతో మాట్లాడుతూ నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ నిర్వహించామని చెప్పిన సజ్జల.. నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొన్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చారని చెప్పారు.

అంతేకాదు, క్రాస్ ఓటింగ్‌కు చేసిన వీళ్ళకి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తామని కూడా టీడీపీ చెప్పి ఉండవచ్చన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దర్యాప్తు తర్వాతే వేటు వేశామన్నారు. తమ అంతర్గత దర్యాప్తులో ఈ విష‍యం క్రాస్ ఓటింగ్ కి పాల్పడింది ఈ ఎమ్మెల్యేలని వెల్లడయిందన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకే వారిపై చర్యలు తీసుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.