Importance of Kites: సంక్రాంతికి ఎగరవేసే గాలిపటాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 10:49 AM

Importance of Kites: సంక్రాంతికి ఎగరవేసే గాలిపటాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

సంక్రాంతి పండగ అనగానే ముందుగా పిల్లలకు, పెద్దలకు అందరికీ గుర్తొచ్చేది గాలిపటాల సంబరాలు. పిల్లలందరూ పెద్దలతో కలిసి గాలిపటాలు ఎగురవేసేందుకు ఉత్సాహపడతారు. మన పెద్దలు ఏ ఆచారాన్ని పాటించినా, ఏ సంస్కృతిని ఆచరించినా దాని వెనక ఏదో ఒక ఆధ్యాత్మికపరమైన కారణం, శాస్త్రీయపరమైన కారణం ఉంటుంది. అయితే పండుగ రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో, సాంప్రదాయపరమైన కారణాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.

మకర సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం జనవరి 14 న జరుపుకుంటారు. ఇది వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మకర సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వచ్చే చివరి పండుగ. ఈ పండుగ తరువాత శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా అది వసంత రుతువు ప్రారంభంగా చెప్తారు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలో సంచారానికి కారణంగా ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు.

మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. పిల్లలు, పెద్దలు మేడ మీద, మైదానాల్లో రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో అంటే… గాలిపటాలు ఎగురవేయాలనే నమ్మకానికి మకర సంక్రాంతికి సంబంధం ఉంది. దీని వెనుక మంచి ఆరోగ్య రహస్యం దాగి ఉంది అంటున్నారు. నిజానికి మకర సంక్రాంతి నాడు సూర్యుని నుంచి అందే సూర్యకాంతి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఆ సూర్యకాంతిలో నిలబడి గాలిపటాలు ఎగరవేయడం ద్వారా సూర్యుని కిరణాలు శరీరంపై పడి వివిధ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.