History of cock fight: సంక్రాంతి పండుగనాడు జరిపే కోడి పందేల చరిత్ర ఏంటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 12:10 PM

History of cock fight: సంక్రాంతి పండుగనాడు జరిపే కోడి పందేల చరిత్ర ఏంటో తెలుసా…?

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడచూసినా కోడి పందేలు విపరీతంగా నిర్వహిస్తారు. నిజం చెప్పాలంటే కోడి పందేల చరిత్ర ఈనాటి కాదు. అనాదికాలం నుండి ఉంది. శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో సైతం కోడి పందేల గురించి విపులంగా రాశారు. కానీ మరి ఈ కోడి పందేలను ప్రభుత్వం చట్టపరంగా నిషేధించి. అక్రమ రవాణా, జంతుబలి, అక్రమ డబ్బు సంపాదన వంటివి దీనికి కారణం. మరి అసలు కోడి పందేలు ఎలా మొదలయ్యాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇపుడు తెలుసుకుందాం…!

సంక్రాంతి వేళ కోడికి కత్తి కడితే కనక వర్షమే అనే సామెత పాతదైనా.. అందులో సత్యం ఎంత ఉందనే విషయం మాత్రం అనుమానమే. ఎందుకంటే వినోదం కోసం నిర్వహించే కోడి పందేలు వేరు..  డబ్బు కోసం ఆడే కోడి పందేలు వేరు. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా సంక్రమించి ఇప్పటికీ కొనసాగుతోంది. సాధారణంగా బెట్టింగ్ కోసం కోడిపందేలు ఆడేవారున్నా.. ప్రసుత్తం  ప్రభుత్వం దానికి అడ్డుకట వేసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు.

పందెం కోళ్లల్లో కూడా చాలా జాతులున్నాయి. వాటిని విభజించి వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.  రసంగి, కౌజు, మైల, చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, ఎరుపుగౌడు, తెలుపుగౌడు లాంటి పేర్లతో వాటిని పిలుస్తుంటారు. డేగ, కాకి అనే జాతి కోళ్ళు బాగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అలాగే పందెం కోడిపుంజులకంటూ ఒక పంచాంగం ఉంది. దానినే “కుక్కుట శాస్త్రం” అంటారు. పూర్వం ఆంధ్ర క్షత్రియులు (రాజులు) తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు.  బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధానికి కారణం కూడా కోడి పందేలే. శ్రీనాథ కవి రాసిన పల్నాటి వీర చరిత్రలో కూడా కోడి పందేల ప్రస్తావన ఉంది.