AP Govt: తొక్కిసలాట ఎఫెక్ట్.. సభలు, ర్యాలీలపై హోంశాఖ ఆంక్షలు

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 11:49 AM

AP Govt: తొక్కిసలాట ఎఫెక్ట్.. సభలు, ర్యాలీలపై హోంశాఖ ఆంక్షలు

AP Govt: రాష్ట్రంలో రాజకీయ సభలు, ర్యాలీలలో వరస ప్రమాదాలు.. ప్రాణ నష్టంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు చేసింది. ఇకపై రాష్ట్రంలో రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోం శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.

అంతేకాదు ఇకపై రోడ్డుకు దూరంగా ప్రజలకు ఇబ్బందిలేని విధంగా మాత్రమే సభలు, రోడ్డు షోలు నిర్వహించాలని ఆదేశించింది. అందుకు అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులకు హోం శాఖ సూచించింది. ఇకపై ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో అవసరమైతే తప్ప షరతులతో కూడిన అనుమతివ్వనున్నట్లు
పేర్కొంది.

తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎందుకీ ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షో సభలో తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన రోడ్ షో తొక్కిసలాటలో 8 మంది మరణించగా.. గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ నేతలు తలపెట్టిన జనతా వస్త్రాల పంపిణీ.. చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు.

ఈ రెండు ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తే.. టీడీపీ నేతల నిర్వహణ లోపమే ఈ ప్రమాదాలకు కారణమని పోలీసులు ఆరోపించారు. గుంటూరు ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు రిటర్న్ కేసులు కూడా నమోదు చేశారు. అయితే.. ఇటీవల జరిగిన ఈ తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. మరి ఈ మార్గదర్శకాలు ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తాయా.. లేక అధికార పార్టీ కూడా పాటిస్తుందా.. ఎన్నికల సమయంలో కూడా ఇవి వర్తిస్తాయా అన్నది ఒకటీ రెండు సభల అనంతరం చూడాల్సి ఉంది.