YSRCP: సీనియర్ల విన్నపాలు.. ససేమీర అంటున్న జగన్!

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 09:15 AM

YSRCP: సీనియర్ల విన్నపాలు.. ససేమీర అంటున్న జగన్!

YSRCP: ఇప్పటి రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా కామన్ వ్యవహారం అయిపొయింది. ఒకప్పుడు ఓ తరం నాయకుల అనంతరం గత్యంతరం లేని పక్షంలో అదే కుటుంబంలోని మరో తరం నేతలుగా తయారయ్యేవారు. అది కూడా సీనియర్ల కనుమరుగైన తర్వాతే జూనియర్లు రంగంలోకి వచ్చేవాళ్ళు. కానీ, ఇప్పుడు వ్యవహారం పూర్తిగా వేరే. సీనియర్లు ఉండగానే వారసులను రాజకీయాలలో దింపి లీడర్లుగా తయారు చేసి వాళ్ళని ఓ పదవిలో కూర్చోబెడుతున్నారు.

ఇక్కడా.. అక్కడా అని లేకుండా.. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొనగా.. అన్ని పార్టీలలో ఈ తరహా వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటారు కానీ.. దాదాపు అన్ని పార్టీలలో ఈ వారసత్వాలు అత్యంత సహజమైపోయాయి. కాగా.. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సీజన్ రాబోతుంది. దీంతో సీనియర్లు మరోసారి తమ వారసులను నిలబెట్టే ప్రయత్నాలు కూడా మొదలుబెడుతున్నారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు ఫుల్ లోడింగ్ నాయకులతో కళకళాడుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఫుల్ లోడింగ్ తో పార్టీ అధిష్టానానికి తలపోటుగా మారుతుంది. సీనియర్ నేతలు ఎవరికి వారు తమ వారసులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ప్లీజ్ ప్లీజ్ అని అధిష్టానాన్ని బ్రతిమాలుకుంటుండగా.. మరికొందరు పార్టీతో పనిలేకుండా స్థానికంగా వారసులను ప్రజలలోకి పంపిస్తూ ఎవరికి వారు ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారు. దీంతో అక్కడున్న ఆశావహుల నుండి అధిష్టానానికి ఒత్తిడి పెరుగుతుంది.

అటు ఉత్తరాంధ్ర నుండి నలుగురు నేతలు.. కోస్తా నుండి ముగ్గురు నేతలు ఏది ఏమైనా ఈసారి తమ వారసులను దింపాలని చూస్తున్నారట. ఇందులో ఇంతకు ముందున్న జగన్ క్యాబినెట్ లో పనిచేసిన ఓ మాజీ మంత్రితో పాటు ఓ సలహాదారు కూడా ఉండగా.. సీఎం జగన్ మాత్రం ప్రస్తుతం వీళ్ళు వాళ్ళు అనేది లేకుండా అందరూ ఈసారికి ఎప్పటి లాగానే ముందుకు పోదామని ప్రయోగాలు చేసేది లేదని తేల్చి చెప్పేశారట. ఓ మైనార్టీ ఎమ్మెల్యే మాత్రం తన కుమార్తెను అధిష్టానంతో సంబంధం లేకుండానే వారసురాలిని ప్రకటించేసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడట.

ప్లీజ్ అన్నా ఈసారికి నామాట వినండి.. ఎప్పటిలాగానే మీరే పోటీ చేయండి.. లేదా క్యాండిడేట్లను మార్చేద్దాం.. కొత్తగా ప్రయోగాలు వద్దని సీఎం జగన్ మోహన్ రెడ్డి వీళ్ళకి చెప్పినట్లుగా.. అయినా వీళ్ళు తమ ప్రయత్నాలు మాత్రం ఆపకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ వారసుల కోసం ఆరాటం ఎంతవరకు వెళ్తుందో.. తిరుగుబాటు పరిస్థితి వస్తే అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.