K.V.P-Chandrababu: మీ సత్తా మాకు తెలుసు.. మీరు ఢిల్లీ రండి.. చంద్రబాబుపై వైఎస్ ఆత్మ కేవీపీ కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 04:07 PM

K.V.P-Chandrababu: మీ సత్తా మాకు తెలుసు.. మీరు ఢిల్లీ రండి.. చంద్రబాబుపై వైఎస్ ఆత్మ కేవీపీ కామెంట్స్!

K.V.P-Chandrababu: టీడీపీ అధినేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, చంద్రబాబు జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని కేవీపీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమంలోకి చంద్రబాబు రావాలని కేవీపీ కోరారు.

కేవీపీ రామచంద్రరావు దివంగత సీఎం వైఎస్ఆర్ కు స్నేహితుడు కాగా.. చంద్రబాబుతోనూ సన్నిహిత్యం ఉంది. వీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కేవీపీ అంటే వైఎస్ ఆత్మగా పేరు తెచ్చుకున్నారు. అయితే, వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు జగన్‌ను కాదని కేవీపీ చంద్రబాబును పొగడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాహుల్ అనర్హత గురించి విపక్షాలు అన్నీ కదం తొక్కాయి. కానీ ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మాత్రం నోరు మెదపడం లేదు. ఇదే అంశాన్ని కేవీపీ రామచంద్రారావు ప్రస్తావించారు. మీరెందుకు స్పందించడం లేదని చంద్రబాబును అంటూనే.. మీరు ఢిల్లీలో ఉండాల్సిన నేత.. మకాం మార్చాలని కోరారు. మీ స్థాయి రాష్ట్రం నుంచి దాటిందని చెప్పారు. ఇండైరెక్టుగా రాష్ట్ర బాధ్యతలను మరొకరికి అప్పగించాలని సూచించారు.

ఈ సందర్భంగానే అత్యంత గౌరవం ఉన్న ప్రతిపక్ష నేత ఏపీలో ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించిన కేవీపీ.. 1984లో నాదెండ్ల సంక్షోభం సమయంలో చంద్రబాబు పోరాటాన్ని ఎవరూ మర్చిపోరని కితాబిచ్చారు. 2018లో ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన చంద్రబాబును కించపరచొద్దంటూ కాంగ్రెస్ నేతలకు గతంలో రాహుల్ సూచించిన విషయాన్ని కూడా కేవీపీ ప్రస్తావించారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మౌనం వీడాలని కేవీపీ అన్నారు.