TDP 41st Formation Day: రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29.. టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు

TDP 41st Formation Day: తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మార్చి 29 రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజని అన్నారు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని వెల్లడించారు.
తెలుగువాళ్ల కోసం ఏంచేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక మీటింగ్ పెడితే, ఆ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయి భారీగా తరలి వచ్చారని, దాంతో ఈ రాష్ట్రం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ నేత చంద్రబాబు తెలియచేశారు. తనకు ఎంతో గుర్తింపు, ఆదరణ కలిగించిన తెలుగుజాతి గర్వపడేలా, తనని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనతో నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని వివరించారు.
ఈ సభ సందర్భంగా, కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ పేరిట వారు చేపడుతున్న కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని కొనియాడారు. కాగా, ఇక దేశవిదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరపాలని నిర్ణయించామని.. ఇవాళ మొట్టమొదటి మీటింగ్ పెట్టాం.. మళ్లీ రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తాం. ఈ మధ్యలో 98 సభలు జరుపుతాం.. ఇది మొదటి మీటింగ్ అయితే, రాజమండ్రిలో 100వ మీటింగ్ జరుగుతుందని చెప్పారు.
తెలుగుజాతి గర్వపడే విధంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో చేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తాం. ఆస్ట్రేలియాలో చేస్తాం, అమెరికాలో కూడా చేస్తాం. ఎన్టీఆర్ వంటి మహనీయుడ్ని అందరూ గౌరవించుకోవాలి. అలాంటి మహనీయుడ్ని గౌరవిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.100 ప్రత్యేక నాణెం తీసుకువచ్చింది. అందుకు ప్రధాని మోదీకి మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని వివరించారు.