TDP Rally: అడ్డుకున్న పోలీసులు.. కాన్వాయ్ వదిలి చంద్రబాబు కాలినడక

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 07:00 PM

TDP Rally: అడ్డుకున్న పోలీసులు.. కాన్వాయ్ వదిలి చంద్రబాబు కాలినడక

TDP Rally: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుకున్నట్లే కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా తీసుకొచ్చిన జీవో పోలీస్ 30 ప్రకారం ర్యాలీకి, సభకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన సొంత నియోజకవర్గంలో తాను పర్యటించేందుకు ఎవరి అనుమతి కావాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందుగా కర్ణాటకకు వెళ్లిన చంద్రబాబు అక్కడ నుండి ఏపీలోకి వచ్చారు. పోలీసు నిర్బంధాలు, అడ్డంకులను ఛేదించుకొని తరలివచ్చిన కుప్పం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సరిహద్దులోని శాంతిపురం మండలం జేపీ కొత్తూరు వద్ద స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారిని చూసి వాహనం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు క్రేన్ సాయంతో గజమాల వేసి స్వాగతించారు. మరోవైపు చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు.. పెద్దూరులో తెదేపా నేతలు ఏర్పాటు చేసిన మైకులు తొలగించారు.

అయితే.. ఫైనల్ గా భారీ ర్యాలీతో పెద్దూరు చేరుకున్న చంద్రబాబుకు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి, స్థానిక సీఐ నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించినా.. నోటీసు తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఎందుకు నోటీసు ఇస్తున్నారో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వాహనం ముందుకు కదలనివ్వకపోవడంతో చంద్రబాబు వాహనం నుంచి కిందకు దిగి పాదయాత్రకు సిద్ధమయ్యారు.

పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ శ్రేణుల నినాదాల మధ్యనే ఎక్కడైతే ప్రచారం రథంతో మాట్లాడాలనుకున్నారో అక్కడకి చేరుకొని తదుపరి కార్యాచరణపై స్థానిక నేతలతో చర్చించారు. మొత్తం మీద పోలీసులు ఎంత ప్రయత్నించినా అటు చంద్రబాబును అడ్డుకోలేకపోగా.. ఇటు కార్యకర్తలు కూడా ఊహించని స్థాయిలో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం.. ముందుగానే స్థానిక నేతలు పోలీసుల అడ్డుకొనే ప్రయత్నాలను పసిగట్టడంతో పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. అయితే.. ప్రచార రథాన్ని సీజ్ చేయడం.. మైకులను పోలీసులు తొలగించడంతో చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడలేకపోయారు.