TDP Rally: చంద్రబాబు ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత.. కార్యకర్తలపై లాఠీ ఛార్జ్

TDP Rally: చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు ర్యాలీ వద్దకు బయలుదేరారు. అయితే.. ర్యాలీకి పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త శృతి మించడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు.
శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు జిల్లాకు వస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు శాంతిపురం చేరుకుంటున్నారు. అయితే ఎక్కడికక్క డ పోలీసులు తమ ఆంక్షలతో వారిని అడ్డుకుంటున్నారు. పర్యటన మార్గాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్.గొల్లపల్లి వద్ద కూడా అడ్డుకోవడంతో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ తోపులాట, లాఠీ ఛార్జ్ లో ఎవరైనా గాయపడ్డారా వారి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదు. చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. సభలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నేపథ్యంలో పోలీసులు చంద్రబాబు పర్యటనకు అనుమతి నిరాకరించారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీ కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కుప్పం పర్యటన చేసి తీరతామని ప్రకటించారు. అనుకున్నట్లే చంద్రబాబు కూడా కుప్పం బయల్దేరారు. అయితే.. ర్యాలీ ప్రాంతానికి వెళ్తున్న కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు.. తేడా వస్తే లాఠీ ఛార్జ్ చేసేందుకు కూడా వెనకాడడం లేదు. దీంతో కుప్పంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు కుప్పం వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.