Pawan-Ali: సై అంటే సై.. ప‌వ‌న్‌పై పోటీకి సిద్ధమన్న అలీ!

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 10:00 PM

Pawan-Ali: సై అంటే సై.. ప‌వ‌న్‌పై పోటీకి సిద్ధమన్న అలీ!

Pawan-Ali: జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరు. దశాబ్దాలుగా వీరి ప్రయాణం సాగుతుంది. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ లో వీరి స్నేహం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. దర్శకులు కూడా ఆయన సినిమాల్లో అలీకి ప్రత్యేకంగా పాత్రలు రాస్తారు. తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పవన్-అలీ కాంబినేషన్ సీన్స్ అదుర్స్ అంతే.

సినిమాలతో పాటు నిజజీవితంలో కూడా మంచి సన్నిహితులుగా పేరున్న ఈ ఇద్దరూ రాజకీయంలో విభిన్న దారుల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయం నుండే వైసీపీలో చేరిన అలీకి ఈమధ్యనే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఎన్నికయ్యారు. ఇంతకి ముందు రాజకీయంగా పెద్దగా పవన్ పై వ్యాఖ్యలు చేయని అలీ.. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఎన్నికైన తర్వాత మాత్రం డోస్ పెంచారు.

ఈ మధ్య కాలంలో పవన్ పై కౌంటర్లు వేస్తున్న అలీ తాజాగా చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో ఏకంగా సంచలన కామెంట్స్ చేశారు. సీఎం ఆదేశిస్తే ఎవరి మీదనైనా పోటీ చేస్తానని స్పష్టం చేసిన అలీ.. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడేనని.. అయితే, స్నేహం వేరు రాజకీయాలు వేరని చెప్పారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసన్న అలీ.. పాలిటిక్స్ లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పారు.

ఇక డైమండ్ రోజా అంటూ మంత్రి రోజాపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై స్పందించిన అలీ.. డైమండ్ చాలా పవర్ ఫుల్, విలువైనదని.. నగరిలో రోజా మరోసారి గెలవడం ఖాయమని చెప్పారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కిగానూ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్పై అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారగా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.