Importance of Bhogi festival: భోగి పండుగ విశిష్టత తెలుసా…? అసలు భోగి అనే పేరు ఎలావచ్చిందో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 09:54 PM

Importance of Bhogi festival:  భోగి పండుగ విశిష్టత తెలుసా…? అసలు భోగి అనే పేరు ఎలావచ్చిందో తెలుసా…?

సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు వెచ్చదనం కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకుంటారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.

సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం అనుభవము. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అంటాము. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం.

ఇక భోగి పండుగనాడు రేగుపండ్ల ప్రత్యేకత గురించి ఇపుడు చూద్దాం. రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.