Specialty of Plum fruits on Bhogi festival: భోగి పండుగరోజు రేగుపళ్లను పిల్లల తలపై ఎందుకు పోస్తారో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 10:49 PM

Specialty of Plum fruits on Bhogi festival: భోగి పండుగరోజు రేగుపళ్లను పిల్లల తలపై ఎందుకు పోస్తారో తెలుసా…?

భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఏ పండుగ జరుపుకున్నా, ఏ ఉత్సవం జరుపుకున్నా దాని వెనక ఆధ్యాతిక కారణాలతో పాటు శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉంటాయి. మరి సంక్రాంతి పండుగకు ముందు వచ్చే భోగి పండుగనాడు ఇంట్లోని చిన్నపిల్లల తలపై రేగుపళ్లను పోసి ఉత్సవం జరుపుకుంటారు.. మరి దీని వెనక ఉన్న పురాణ కథ ఏమిటో, ఆధ్యాత్మిక కారణం ఏమిటో, శాస్త్రీయ పరమైన కారణాలేమిటో ఇపుడు చూద్దాం…

భోగి పండుగనాడు భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లల తలపై  పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. వీరికి రేగుపళ్లు అమృతంలా పనిచేస్తాయట. ఎందుకంటే వీటిలో విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పెంచడమే కాదు జీర్ణసంబంధిత వ్యాధులు, శరీర రుగ్మతనలనూ నివారించేందుకు ఉపయోగపడుతుంది. రేగు పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమైన జ్ఞానం పెరుగుతుందని చెబుతారు.

రేగుపళ్లను అర్కఫలం అని కూడా అంటారు.  ‘అర్కుడు’ అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కావడంతో  ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్ లో అయినా రేగు చెట్టు పెరుగుతుంది. ఎండని, వాననీ అన్నింటినీ తట్టుకుంటుంది. వీటిని బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్లు పోసే సంప్రదాయం వచ్చిందని కూడా చెబుతారు.