Importance of Rangoli: సంక్రాంతి పండుగకి వేసే ముగ్గుల ప్రత్యేకత ఏంటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 11, 2023 | 11:06 AM

Importance of Rangoli: సంక్రాంతి పండుగకి వేసే ముగ్గుల ప్రత్యేకత ఏంటో తెలుసా…?

ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి ఉత్సవాలలో భోగి, మకర సంక్రాంతి, కనుమ అనేవి ప్రత్యేకమైనవి అయితే ఈ మూడు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచేవి మాత్రం ఇంటి ఆడపడచులు తమ ఇళ్ల ముందు వేసుకునే ముగ్గులే. ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టల తళుకులు, వంటివి పండగ వాతావరణాన్ని తలపిస్తాయి. ఈ పండగ వాతావరణంలో ఎంతో ఆకర్షణగా నిలిచే ఈ ముగ్గుల ప్రత్యేకత ఏమిటో, అసలు రంగోలి జరుపుకునే సంప్రదాయం ఏవిధంగా వచ్చిందో ఇపుడు తెలుసుకుందాం.

ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో ఇళ్లన్నీ దర్శనమిస్తాయి. తమిళ సంస్కృతిలో తొలిసారిగా ముగ్గు గురించి మధ్య యుగానికి చెందిన ఆండాళ్ అనే కవయిత్రి ప్రస్తావించారు. ముగ్గులు, మహిళల మధ్య సంబంధం గురించి చెబుతూ రంగులతో వేసే రకరకాల రంగవల్లులు మహిళల ధార్మిక క్రతువులో ఒక భాగం అని వివరించారు. డిసెంబర్-జనవరి నెలలని తమిళనాడులో ‘మార్గాహి’ అంటారని, శీతాకాలం ప్రవేశంతో, పూజకి, ఆధ్యాత్మికతకు ఈ కాలం నెలవుగా ఉండటం వలన ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సాంప్రదాయంగా స్థిరపడిందని పండితులు చెబుతున్నారు.

విశ్వంలో ఉండే శక్తులను, భూమాతని, దేవతలను ఆరాధించేందుకు ఇదొక మార్గమని చాలా మంది పండితులు అభిప్రాయపడ్డారు. అలాగే ముగ్గులు లెక్కల పట్ల అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు. ముగ్గులు పెట్టడం వెనక చాలా కారణాలు దాగి ఉన్నాయని అంటూ, కొన్ని వేల జీవాలకు ఆహారంగా ఈ ముగ్గు పిండి ఉపయోగపడుతుందని తెలిపారు. చాలా ప్రాంతాలలో ముగ్గు కోసం బియ్యం పిండిని వాడతారు. ఈ పిండిని బయట తిరిగే క్రిమి కీటకాలు, పశు పక్ష్యాదులు ఆహారంగా తీసుకునేందుకు ఉపయోగపడతాయని కొందరు భావిస్తారు.