Weather Update: ఒక్కసారిగా మారిన వాతావరణం.. మండు వేసవిలో మధ్యాహ్నం వేళ వడగళ్ల వాన!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 03:44 PM

Weather Update: ఒక్కసారిగా మారిన వాతావరణం.. మండు వేసవిలో మధ్యాహ్నం వేళ వడగళ్ల వాన!

Weather Update: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ తో పాటు పలు జిల్లాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తుంది. హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌, నాగోల్‌, వనస్థలిపురం, లంగర్‌హౌజ్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఆరాంఘర్‌లో వర్షం కురుస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సంగారెడ్డి, వికారాబాద్‌, జహీరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వడగళ్ల వాన దంచికొడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం జోరుగా పడుతోంది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఒక్క సారిగా చల్లబడిన వాతావరణంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఉక్కపోతతో, సూర్యుడి భగభగలతో ఉక్కిరబిక్కిరైన ప్రజలు చిరుజల్లులు కురవడంతో మురిసిపోతున్నారు.. వర్షంలో అడుతు పరవశించి పోతున్నారు.

మండు వేసవిలో మధ్యాహ్నం వేళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురవడంతో రహదారుల మీద మంచు గడ్డలు పేరుకుపోయాయి. హైదరాబాద్‏లోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘామృతమై ఉంది. మిట్టమధ్యానమే దట్టమైన మేఘాలతో చీకట్లు అలుముకున్నాయి. పలు ప్రాంతంలో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది.

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా.. తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో నాలుగు రోజుల పాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.