Delhi Liquor Scam: ఈ నెల 20న హాజరు కావాల్సిందే.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు!

Delhi Liquor Scam: ఈ నెల 20న సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేనని కవిత ఈడీకి లేఖ రాసినా గురువారం మధ్యాహ్నం వరకు ఈడీ నుండి స్పందన లేదు.
ఈ నేపథ్యంలో ఈడీ విచారణ వ్యవహారంలో కొంత సస్పెన్స్ కొనసాగింది. అయితే, తాజాగా మరో తేదీన విచారణకు రావాలని ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణపై సస్పెన్స్ వీడింది. కాగా, ఈ కేసులో విచారణ విషయంలో ఈడీ వెనక్కి తగ్గడం లేదు. గురువారం విచారణకు గైర్హాజరైన ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు పంపింది. ఈ నెల 20న తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు.
కాగా, గురువారం ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద హైడ్రామా నడిచింది. ఉదయం నుంచి మంత్రులతో కవిత చర్చించారు. ముందుగా ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు వెళ్తానన్న కవిత.. న్యాయనిపుణులతో చర్చ తర్వాత ఈడీ ఆఫీస్‌కు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున.. విచారణకు రాలేనని చెప్పి.. ఈ మేరకు తన న్యాయవాది సోమాభరత్‌తో ఈడీ ఆఫీస్‌కు సమాచారం పంపారు.
మరోవైపు, ఈ కేసులో కవితకు బినామీ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లై కస్టడీని స్పెషల్ కోర్టు ఈడీ అభ్యర్థనపై పొడిగించింది. అతణ్ని, కవితను కలిపి విచారించాల్సిన అవసరముందని పేర్కొంది. మరో నిందితుడు, ఏపీ వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపింది. 18న తమ ముందు హాజరు కావాలని స్పష్టం రేసింది. ఈ కేసులో మాగుంట కొడుకు రాఘవరెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేయగా అతడు ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నాడు.