Weather Update: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 03:22 PM

Weather Update: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

Weather Update: ఒకవైపు చలి తీవ్రత ఎక్కువవుతుండగా మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం వాయుగుండంగా బలపడనుంది. శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.

ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఫిబ్రవరి 1న శ్రీలంక తీరానికి చేరుకుంటుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

సోమవారం నుంచి మూడు రోజులపాటు ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాలలో మోసర్తు వర్షాలు కురవబోతున్నాయి. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది.

కాగా, ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఉండదని ఇక్కడి అధికారులు చెప్తున్నారు. ఏపీకి వర్ష సూచనలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు పడితే కనుక అటు యాసంగి రైతులతో పాటు పత్తి, మిర్చి, పొగాకు రైతులు నష్టపోయే ఛాన్స్ ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేలికపాటి, మోస్తరు జల్లులు పడితే కనుక ఎవరికీ ఎలాంటి నష్టాలు ఉండవు. భారీ వర్షాలు కురిస్తే రైతులకు మళ్ళీ ఇబ్బందులు తప్పవు.