Suicide Attempt: ప్రగతి భవన్ ముందే కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 04:18 PM

Suicide Attempt: ప్రగతి భవన్ ముందే కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం

Suicide Attempt: ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కుటుంబం అంతా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తన భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని.. ఉన్న భూమి పోయి బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీం పట్నానికి చెందిన ఐలేష్ అనే వ్యక్తి భార్యతో సహా ప్రగతి భవన్ ముందు కిరోసిన్ పోసుకుని అంటించుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలంటూ ఐలేష్ ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఐలేష్ తన భూమిని ప్రభుత్వం తీసుకొని నష్టపరిహారం చెల్లించలేదని.. ఈ విషయంపై అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఐలేష్ వాపోయాడు.

తన ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో బాధితుడు నేడు ప్రగతి భవన్ కి రాగా అక్కడే ప్రగతిభవన్ వద్ద ఈ ఘటనకి పాల్పడ్డాడు. బాధితుడు ఐలేశ్ తెలిపిన వివరాలు ప్రకారం 2010 సంవత్సరంలో తన భూమిని ప్రభుత్వం తీసుకొని ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదని ఆరోపణలు చేశారు. తక్షణమే తన కుటుంబానికి పరిహరం ఇప్పించాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులతో సహా ప్రగతి భవన్ కు వచ్చాడు.

ఏమైందో ఏమో అంతలోనే మనస్థాపానికి గురై కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తోన్న భద్రత సిబ్బంది వెంటనే గమనించి అతని చేతిలోని కిరోసిన్ బాటిల్ లాక్కున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం ఐలేష్ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని ఐలేష్ అభ్యర్థించారు.