Weather Update: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ సూచన.. నగరంలోని ఆరు జోన్లకు ఎల్లో అలెర్ట్!

Kaburulu

Kaburulu Desk

March 23, 2023 | 01:11 PM

Weather Update: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ సూచన.. నగరంలోని ఆరు జోన్లకు ఎల్లో అలెర్ట్!

Weather Update: రెండు రోజుల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రోజులు హడలెత్తించిన వానలు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సూచించింది.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాబోయే రెండు రోజుల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ నెల 24, 25 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షాల స్థాయిని బట్టి నగరంలోని ఆరు జోన్లకు వివిధ అలర్ట్‌లు జారీ చేసింది. ముఖ్యప్రాంతాలైన చార్మినార్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. నగర వాసులు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ సమయంలో ఈ ప్రాంతాల వారు, ఈ ప్రాంతాల నుండి వెళ్లే వారు తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మొన్నటి వర్షాలకు హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారులోని కొన్ని ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ నగరంలో కురిసిన వడగళ్ల వాన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఐస్ గడ్డల వానతో పలు ప్రాంతాలలో బిల్డింగులు అద్దాలు, కార్ల అద్దాలు ధ్వంసమవగా.. వర్షపు నీటికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఈదురు గాలులకు నగర శివార్లలో రేకుల కప్పు ఇల్లు, హోటళ్లు ధ్వంసమవగా.. ద్రాక్ష, మామిడి తోటలు తీవ్రం దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల వానలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది.