Weather Update: అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షం!

Weather Update: ఏ ఏడాది వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. మండు వేసవి మార్చిలో వరసగా వర్షాలు కురుస్తున్నాయి. మార్చి నెలలో చిరుజల్లులు పడి వేడి గాలులు మొదలవడం ప్రతి ఏడాది జరిగేదే కాగా.. ఈ ఏడాది మాత్రం వానలు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. అది కూడా జోరు వానలు కురవడం కాస్త ఆశ్చర్యంగా కూడా కనిపిస్తుంది. ఓ వైపు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి అకాల వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే, మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వర్షం కురువొచ్చని కూడా హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, కుమ్రుం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇక, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆది, సోమ, మంగళ వారాలలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.