Contraception Method: గర్భనిరోధానికి కేంద్రం కొత్త పద్ధతి.. ముందుగా తెలుగు రాష్ట్రాలలో అమలు!

Kaburulu

Kaburulu Desk

March 23, 2023 | 04:46 PM

Contraception Method: గర్భనిరోధానికి కేంద్రం కొత్త పద్ధతి.. ముందుగా తెలుగు రాష్ట్రాలలో అమలు!

Contraception Method: కాస్త శ్రద్దగా గమనిస్తే మన సమాజంలో గర్భం, పిల్లలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో ఒకటి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివాహం జరిగిన చాలా మంది ఆడవారిలో గర్భ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల వారు గర్భం దాల్చడం దాదాపు సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారు. మన దగ్గర కూడా వివాహమై దశాబ్దాలు గడిచినా పిల్లల భాగ్యం కలగక చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

మరి కొంతమంది పిల్లలను కనడం ఇష్టం లేక, పిల్లలు కలగకుండా శృంగారం చేయాలనే వారు ఎక్కువగా కండోమ్స్, పిల్స్, కాపర్-T పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ పద్దతుల వలన కొన్ని సమస్యలుండడం.. ఈ పద్దతులను పాటించినా వంద శాతం నిరోధకం కాకపోవడంతో మరో సమస్యగా కనిపిస్తుంది. కాగా, గర్భ నిరోధక పద్దతుల స్థానంలో ఇప్పుడు మరో కొత్త పద్ధతి వస్తోంది. దీనిని తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ కొత్త సాధనం 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది. దీనిని మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీంట్లో నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికి ఈ సాధనం హార్మోన్‌తోనే తయారవుతుంది. సంతానం మధ్య దూరం ఉండాలని కోరుకునే వారు ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తున్నారు. ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారు. స్టాఫ్ నర్సులు కూడా దీనిని సులభంగా అమర్చేలా శిక్షణ ఇస్తారు. కుడిచేతి వాటం ఉన్న వారికి ఎడమవైపు, ఎడమచేతి వాటం ఉన్న వారికి కుడివైపు అమర్చే ఈ సాధనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా తొలగించుకోవచ్చు. తొలగించిన 48 గంటల తర్వాత గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుందట.