Weather Update: ఐఎండీ హెచ్చరిక.. ఏపీలోని ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 09:01 PM

Weather Update: ఐఎండీ హెచ్చరిక.. ఏపీలోని ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం!

Weather Update: దంచికొడుతున్న ఎండల ప్రభావంతో అల్లాడిపోతున్న ప్రజలకు చిరుజల్లులు కాస్త ఉపశమనం కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది. హైదదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది.

కాగా, ఏపీలో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బంగాళాఖాతంలో రెండు ద్రోణుల ప్రభావంతో ఏపీ వైపు తేమ గాలులు వీస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 19 వరకూ కోస్తా జిల్లాల్లో.. ఇవాళ, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది.

ఐఎండీ ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి అవరించి ఉందని తెలిపిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు, భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. పిడుగుపాటు నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉండగా.. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.