CM KCR: దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హొలీ పౌర్ణమి శుభాకాంక్షలు!

Kaburulu

Kaburulu Desk

March 6, 2023 | 11:59 PM

CM KCR: దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హొలీ పౌర్ణమి శుభాకాంక్షలు!

CM KCR: వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సిఎం కేసీఆర్ హోళీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటా పాటలతో, కోలాటాల చప్పుల్లతో హోళీ ఉత్తేజం వెల్లివిరుస్తుందన్నారు. పిల్లా పెద్దా తేడాలేకుండా సింగిడి రంగుల నడుమ ఖేలీ కేరింతలతో సాగే హోళీ, మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మనకు అందిస్తుంద‌న్నారు. బేధభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్దమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం సూచించారు.

స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ, తెలంగాణలోని దళిత బహుజన, సకల జనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని సీఎం తెలిపారు. దేశ ప్రజలందరి జీవితాల్లో నూతనోత్తేజం వెల్లివిరిసేదాకా తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, హోలీ అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు.

భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా) లేదా బసంత-ఉత్సబ్ (వసంతోత్సవ పండుగ) అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.