Hyderabad Traffic: విద్యుత్ ఉద్యోగుల ఆందోళన.. హైదరాబాద్ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 04:45 PM

Hyderabad Traffic: విద్యుత్ ఉద్యోగుల ఆందోళన.. హైదరాబాద్ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Hyderabad Traffic: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ఛలో విద్యుత్ సౌధ పిలుపు మేరకు శుక్రవారం ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలని, వేతన సవరణ-2022, ఆర్టిజన్ సమస్యలు ఈపీఎఫ్ స్థానంలో జీపీఎఫ్(1999-2004) అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరకంగా నినాదాలు చేశారు. న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించడంతో పాటు పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని.. ఒకవేళ అది చేయకపోతే తమ ఆందోళనలు ఉదృతం చేస్తామని నినాదాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంటనే దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల ధర్నాకు పలు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆందోళనతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్‌ -పంజాగుట్ట రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ముఖ్యంగా రవీంద్రభారతి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, మహావీర్ ఆస్పత్రి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్ని అడ్డుకునేందుకు విద్యుత్‌ సౌధ ముందు పోలీసులు మోహరించారు. నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో ఖైరతాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.