Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 04:26 PM

Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

Rahul Gandhi: గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ తాజాగా సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది.

2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీ సూరత్ కోర్టులో కేసు వేశారు. తన వ్యాఖ్యల ద్వారా మొత్తం మోడీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానపరిచినట్టయిందని పిటిషన్ లో పేర్కొన్నారు. రెండేళ్ల విచారణ తర్వాత రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష తీర్పునిచ్చింది. వెంటనే బెయిల్ మంజూరు చేసింది.

కాగా, ఇప్పుడు ఈ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. తాజాగా రాహుల్ లోక్‌సభ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడింది. ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. ఈ అనర్హత 23 మార్చి 2023 నుంచి నుంచి వరిస్తుందని, భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నామని సర్క్యూలర్ లో పేర్కొన్నారు.

ఈ కేసులో కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా పై కోర్టులు కనుక సూరత్ కోర్టు తీర్పును కొట్టేయకపోతే రాహుల్‌ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. మరి పై స్థాయి కోర్టులలో తీర్పు ఎలా ఉండనుండో చూడాలి.