Sitarama Kalyanam: అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం.. ఈసారి కూడా సీఎం కేసీఆర్ డుమ్మా!

Kaburulu

Kaburulu Desk

March 30, 2023 | 11:38 AM

Sitarama Kalyanam: అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం.. ఈసారి కూడా సీఎం కేసీఆర్ డుమ్మా!

Sitarama Kalyanam: నేడు సీతారామ కల్యాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతుంది. ప్రధానంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిందే. వీధి వీధిన రాములోరి గుడి ఉంటుంది. ఆ గుడిలో నేడు సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కన్నులపండగగా జరిగే సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుక ప్రారంభమైంది.

భద్రాచలంలో సీతారాముల కళ్యాణం గురువారంనాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల స్వామి వారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు రవిచంద్ర, కవిత తదితరులు పాల్గొన్నారు. కాగా, సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

సీతారాముల కల్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగుతుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఆంక్షల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ దఫా సీతారాముల కళ్యాణానికి ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు. భక్తుల కోసం 10 అడ్డూ కౌంటర్లు, 70కి పైగా తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.

కాగా, భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఈ ఏడాది కూడా సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. 2016లో చివరిసారి రామయ్య కల్యాణానికి సీఎం హాజరయ్యారు. ఆ తర్వాతి నుంచి భద్రాద్రి ముఖమే చూడడం మానేశారు. భక్త రామదాసు భద్రాద్రిలో ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచీ సీతారాముల కల్యాణానికి పాలకులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అది నేటికీ కొనసాగుతోంది. కాగా, సీతారాముల కల్యాణం తర్వాతి రోజున పట్టాభిషేకం జరిపించడం 2003 నుంచి ఆనవాయితీగా మారింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.