CM KCR: కేంద్రానికి చెప్పినా.. ఆ గోడకు చెప్పినా ఒక్కటే.. పంటనష్టంపై నివేదిక పంపడం దండగేనన్న సీఎం!

Kaburulu

Kaburulu Desk

March 23, 2023 | 02:00 PM

CM KCR: కేంద్రానికి చెప్పినా.. ఆ గోడకు చెప్పినా ఒక్కటే.. పంటనష్టంపై నివేదిక పంపడం దండగేనన్న సీఎం!

CM KCR: ఇటీవల కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాలలో పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. వండగళ్ల వానతో మిర్చి, మామిడి, మినుము, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే పంట నష్టం, బాధిత రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. రావినూతలలో రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఓ రైతు 32 ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే 20 ఎకరాల్లో నష్టం జరిగిందని తెలిపారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని కేసీఆర్ ను రైతులు కోరారు. మొత్తం 1.29 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం కలిగిందని అధికారులు సీఎంకు వివరించారు. 79వేల ఎకరాల్లో వరి పంట పాడైందని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎకరాకు రూ.10వేలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంట నష్టంపై నివేదికను కేంద్రానికి పంపించదల్చుకోలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రానికి గతంలో నివేదిక పంపించామని.. అయినా నయాపైసా ఇవ్వలేదని అన్నారు. కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనన్నారు. కేంద్రానికి నిరసనగా నివేదిక పంపించడం లేదని స్పష్టం చేశారు. అయినా రైతులు నిరాశ చెందవద్దని సూచించారు. కౌలు రైతులను ఆదుకునేలా కూడా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మన దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోందని.. వ్యవసాయం దండగనే మూర్ఖులు ఉన్నారన్నారు. దేశంలో ఇప్పుడు రైతుకు లాభం కలిగించే పాలసీలు లేవని సీఎం కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 10వేల నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పటివరకు తుఫాన్ల సమయంలో కూడా ఇంత సాయం చేసిన దాఖలాలు లేవని రైతులకు తెలిపారు.