Viral News: మేక పిల్లకి పాలిస్తున్న కుక్క.. అమ్మ తనానికి జాతి వైరం ఉండదంటే ఇదేనేమో!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 11:13 PM

Viral News: మేక పిల్లకి పాలిస్తున్న కుక్క.. అమ్మ తనానికి జాతి వైరం ఉండదంటే ఇదేనేమో!

Viral News: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కలు కురుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామాల నుండి నగరాల వరకూ ఎక్కడ చూసినా పెరిగిన కుక్క కాట్లు గురించే కథలు. ఇలాంటి తరుణంలో ఓ కుక్క ఆ జాతి చెడ్డపేరును చెరిపేసే ప్రయత్నం చేసింది. ఆకలిగా ఉన్న ఒక మేక పిల్ల ఆకలి తీర్చిందో శునకం. కుక్కల్లో సాధుతత్వం కోల్పోతున్న తరుణంలో ఒక కుక్క అమ్మతనాన్ని ప్రదర్శించింది.

ఇది అనంతపురంలోని కళ్యాణ్ దుర్గ అనే పట్టణంలో ఉన్న దొడగట్ట గ్రామంలో జరిగింది. దొడగట్ట గ్రామానికి చెందిన మేకల కాపరి గొల్ల ఓబులపతికి 30 మేకలు ఉన్నాయి. వీటిలో ఒక మేక 15 రోజుల క్రితం ఒక మేకపిల్లను జన్మనిచ్చింది. అయితే ఆ తల్లి మేకకు పిల్లకు ఇవ్వడానికి తగిన పాలు లేవు. అదే సమయంలో మేకల దొడ్డి వద్ద ఓ కుక్క నాలుగు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. మేకల కాపరి కుక్కను మేకల దొడ్లోకి పిలవగా ఆ కుక్క వెళ్ళింది.

అయితే, కుక్క పిల్లలు పాలు తాగడం చూసి ఆ మేకపిల్ల ఆ కుక్క దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. కుక్క కూడా ఏమీ అనలేదు. ఇలా 15 రోజుల నుంచి ఆ కుక్క మేకపిల్లకు పాలిస్తూ వస్తుంది. కుక్కలను చూస్తే మేకలు భయపడి పారిపోతాయి. అలాంటిది ఈ మేకపిల్ల కుక్కను తల్లిగా భావించి పాలు తాగడానికి వెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అమ్మ తనానికి జాతితో పనిలేదని.. అమ్మ ప్రేమకి ఎలాంటి తారతమ్యాలు ఉండవని అంటే ఇదేనేమో!