Anantapur: బతికుండగానే చంపేసి.. నకిలీ ధ్రువపత్రాలతో ఇన్సూరెన్స్ డబ్బు కాజేసే ముఠా అరెస్ట్!

Anantapur: కొందరు కష్టపడి సంపాదించడం మానేసి ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతుకుతుంటారు. అయితే.. ఇలా అడ్డదారులు, అక్రమ మార్గాలలో డబ్బు సంపాదిస్తే ఏ రోజైనా కటకటాల పాలవ్వాల్సిందే. ఇప్పటికే మనుషులపై ఇన్సూరెన్స్ చేసి దొంగ నామినీలు పెట్టుకొని వాళ్ళని చంపేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చూసిన వాళ్ళని.. బ్రతికుండగానే చనిపోయినట్లు దొంగ ఆధారాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూసేశాం. కాగా, ఇప్పుడు వ్యక్తులకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి.. బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కాజేసే ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా, తాడిపత్రి నగరంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి.. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు బతికి ఉండగానే.. వారు చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల సర్టిఫికేట్లు, ఫొటోలు మార్పిడి చేసిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లతో ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దగ్గర నుంచి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు.
తాడిపత్రిలోని హరిజనవాడకు చెందిన గిత్త రంగనాయకులు ఒక ఇన్సూరెన్స్ సంస్థలో పని చేసేవాడు. కాగా, రంగనాయకులు శాంతమ్మ అనే మహిళకు రూ.20 లక్షలు ఇన్సూరెన్స్ చేసి కంపెనీని మోసం చేశాడు. శాంతమ్మ బతికుండగానే ఆమె మృతి చెందినట్లు నకిలీ ధృవపత్రం సృష్టించి డబ్బులు కాజేశాడు. శాంతమ్మ అనే మహిళ బతికే ఉందని.. ఆమె డబ్బులు కాజేయాలనే ఏజెంట్ ఇలా చేశాడని ఇన్సూరెన్స్ అధికారులు విచారణలో గుర్తించారు. దీంతో ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇన్వెస్టిగేషన్లో రంగనాయకులతో పాటు గురుశేఖర్, చింతలయ్య గారి రంగనాయకులు, చంద్రశేఖర్, గౌర్ స్పీర్ అంతా కలసి ఈ మోసం చేశారని తేలింది. వారంతా కలసి నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి మోసగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి దగ్గర నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చామని డీఎస్పీ చైతన్య పేర్కొన్నారు.