Janasena: నాగబాబు పర్యటనకి అనుమతి నిరాకరణ.. అనంతపురంలో టెన్షన్ టెన్షన్!

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 11:55 AM

Janasena: నాగబాబు పర్యటనకి అనుమతి నిరాకరణ.. అనంతపురంలో టెన్షన్ టెన్షన్!

Janasena: ఏపీలో ప్రతిపక్ష నేతల పర్యటనలు హీట్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. నేతల పర్యటనలకు పోలీసుల అనుమతి ఇవ్వకపోవడం.. అయినా నేతలు పర్యటనలకు వెనక్కు తగ్గకపోవడం.. ఇటు కార్యకర్తలు, పోలీసుల మధ్య కుమ్ములాటలు, లాఠీ ఛార్జిలతో ఎక్కడ పర్యటనలకు దిగినా వివాదాస్పదమైపోతున్నాయి. గత ఏడాది విశాఖలో పవన్ పర్యటన నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన వరకు అన్నీ రగడ రగడగానే మారిన సంగతి తెలిసిందే.

ఒకవైపు పది రోజులుగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అనుమతి కోరుతూ లేఖలు రాస్తున్నా పోలీసులు కొర్రీలు చెప్తూ అనుమతి ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుండాగానే.. ఈరోజు అనంతపురం జనసేన నేత నాగబాబు పర్యటనకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నాగబాబు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించడంతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జనసేన పార్టీ శ్రమదాన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లా చెరువుకట్టలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో నాగబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, ఆదివారం నాగబాబు పర్యటన జరగనుండగా రాత్రికి రాత్రే రోడ్లకు అధికారులు మరమ్మతులు మొదలు పెట్టారు. ఆదివారం జనసేన శ్రమదానం కార్యక్రమానికి, నాగబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.

అయితే తాను పర్యటనను రద్దు వేసుకునే అవకాశమే లేదని, కార్యక్రమాన్ని చేపట్టి తీరుతానంటూ నాగబాబు ప్రకటించారు. దీంతో ఏం జరగనుందని అనంతపురంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఇప్పటికే నాగబాబు కార్యక్రమం చేపట్టే ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించగా.. జనసేన కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్న జనసేన కార్యకర్తలు.. భారీ ర్యాలీగా ఆ ప్రాంతానికి చేరుకొనేందుకు కూడా జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగనుందని ఉత్కంఠ నెలకొంది.