TSPSC: టీఎస్‌పీఎస్సీ జెరాక్స్ సెంటర్.. ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలు లభించును!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 04:25 PM

TSPSC: టీఎస్‌పీఎస్సీ జెరాక్స్ సెంటర్.. ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలు లభించును!

TSPSC: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు పేపర్ల లీకేజీ వ్యవహారం కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ విచారణ కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులకు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

అదలా ఉండగానే హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ వద్ద పోస్టర్లు కలకలం సృష్టించాయి. ‘టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ అంటూ నాంపల్లిలోని కార్యాలయం సమీపంలో పోస్టర్లు వెలిశాయి. ‘ఇచ్చట అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రములు లభించును’ అంటూ ఓ వ్యక్తి పోస్టర్లను అంటించాడు. తప్పు చేసిన టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా కేవలం పరీక్షను రద్దు చేయం ఏంటి? శిక్ష ఎవరికి బోర్డుకా, విద్యార్థులకా? ఇది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు అంటూ విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి గారు.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ప్రశ్నాప్రతాల లీకేజీలో మీ కుటుంబసభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే సీబీఐకి అప్పగించి టీఎస్‌పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి. నష్టపోయిన విద్యార్థులకు ఈనెల నుంచే నెలకు రూ.10000 చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు నష్టపరిహారం చెల్లించాలని పోస్టర్లలో పేర్కొన్నారు.

ఇదే నెలలో నాలుగు రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపాయి. కేసీఆర్ ఫిలిమ్స్.. కల్వకుంట దొంగల ముఠా అనే టైటిల్ తో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్ అని సినిమా పోస్టర్ లా అతికించిన ఆ పోస్టర్లు అప్పుడు సంచలనంగా మారాయి. కాగా, ఇప్పుడు ఇలా టీఎస్పీఎస్సీ జెరాక్స్ సెంటర్ అని వెలసిన పోస్టర్లు మరింత సంచలనంగా మారాయి.