TSPSC Paper Leak Case: నిరుద్యోగ మార్చ్.. పోలీసుల అరెస్టులతో భగ్గుమంటున్న ఓయూ క్యాంపస్!

TSPSC Paper Leak Case: ఓయూ క్యాంపస్ మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల నిరసన, పోలీసుల అరెస్టుతో క్యాంపస్ భగ్గుమంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మరో పోరాటానికి సిద్ధమైంది. విద్యార్థులు చేపట్టిన నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులపై విద్యార్థి సంఘాలు, జేఏసీ భగ్గుమంటోంది. విద్యార్థులను బయటకు రాకుండా క్యాంపస్ హాస్టళ్ళలోనే నిర్భందించడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఒకవేళ బయటకి వస్తే పోలీసులు వాహనాలలో తరలించి అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు, నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ భీం రావు నాయక్ అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి మూల కారకులైన ఛైర్మన్, సభ్యులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగ యువత ఆవేదనపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని భీం రావు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షాలపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. వరుసగా రెండో రోజూ గృహ నిర్బందం చేయడమేంటని ఆయన నిలదీశారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అసలు నిందితులను వదిలేసి ప్రశ్నించే ప్రతిపక్షాన్ని ప్రభుత్వం అరెస్ట్ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం బాధితుల వైపు ఉండాల్సిందిపోయి నిందితులను రక్షించే పనిలో ఉందని అద్దంకి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ వ్యవహారంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి.