Ponguleti Srinivasa Reddy: పొంగులేటి భారీ స్కెచ్?.. టీఆర్ఎస్ పేరిట కొత్త పార్టీ ప్రారంభం?

Ponguleti Srinivasa Reddy: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నారు. తనకున్న ఇమేజ్, జిల్లాలో ఉన్న తన అనుచరగణం, మద్దతు దృష్టిలో పెట్టుకుని నిత్యం ప్రచారంలో ఉండే ఈయన బీఆర్ఎస్ నుండి దూరంగా జరిగి తదుపరి స్టెప్ కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బీఆర్ఎస్ అధినాయకత్వం మీద విమర్శల ఘాటు పెంచుతూ వ్యక్తిగత అజెండాతో విస్తృతంగా పర్యటనలు చేస్తూ వస్తున్నారు.
పార్టీ నాయకత్వం తీరుపై తొలిసారి అసంతృప్తి వ్యక్తం చేసిన నాటి నుంచే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ మార్పు పట్ల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని, లేదు లేదు బీజేపీలో చేరతారని, అసలు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరి, షర్మిల నాయకత్వంలో పనిచేస్తారని.. ఇలా ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా ఇదే ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
అయితే, తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ పార్టీ కూడా బీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇచ్చేలా తెలంగాణ రైతు సమితి(టీఆర్ఎస్) పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ అంటే ఓ బ్రాండ్. ఆ పేరుతో ఆయన తనవర్గాన్ని గెలిపించుకొని అసెంబ్లీలో చక్రం తిప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు పొంగులేటి అనుచరులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ అనే బ్రాండ్‌తోనే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను కొట్టాలని పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తెలంగాణ రైతు సమితి పేరుతో పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌తో అధికార పార్టీ గెలుపుకు ఈజీగా బ్రేక్ వేయవచ్చని శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో పొంగులేటి శ్రీనన్న పేరుతో కార్యాలయాలను సైతం ఓపెన్ చేసిన ఆయన మరో అడుగు ముందుకేసి పినపాక, వైరా, ఇల్లందు, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాలకు తన అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక మిగిలింది తన సొంత పార్టీ ప్రకటన మాత్రమేనని ప్రచారం మొదలైంది.