Mutton Canteen: హైదరాబాద్‌లో మటన్ వంటకాలతో క్యాంటీన్లు.. మెనూ చూస్తే నోరూరాల్సిందే!

Kaburulu

Kaburulu Desk

February 25, 2023 | 03:52 PM

Mutton Canteen: హైదరాబాద్‌లో మటన్ వంటకాలతో క్యాంటీన్లు.. మెనూ చూస్తే నోరూరాల్సిందే!

Mutton Canteen: హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. దేశంలో.. ప్రపంచంలో ఎక్కడ బిర్యానీ తిన్నా.. హైదరాబాద్ బిర్యానీ ఒక్కసారి రుచి మరిగితే ఇక అన్నీ దిగదుడుపే. ఇదే హైదరాబాద్ లో హలీం కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా మటన్ హలీం కోసమైతే బారులు తీరుతుంటారు. ఇలా హైదరాబాద్ బిర్యానీ, హలీం అంటే ఇష్టపడేవారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెబుతోంది. నాన్వెజ్ ప్రియుల కోసం మటన్ వంటకాలతో క్యాంటీన్ తీసుకురాబోతుంది.

హైదరాబాద్ మత్స్య భవన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపల క్యాంటీన్ ల తరహాలోనే ఈ మటన్ క్యాంటీన్ లను రూపొందించనున్నారు. రుచికరమైన వంటకాలు అందుబాటు ధరలో లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ మటన్ క్యాంటీన్ లను ప్రారంభించనుండగా ముందుగా హైదరాబాద్ లో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు.

ఇక్కడ, మటన్ బిర్యానీతో పాటు ఇతర మటన్ వంటకాలను కూడా ఆహార ప్రియులకి అందించనుంది. మటన్ బిర్యానీ, పాయా, గుర్దా ఫ్రై, పత్తర్ కా గోష్, ఖీమా వంటి మటన్ వంటకాలను అందించే ఈ మటన్ క్యాంటీన్ లలో షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ స్వచ్ఛత, నాణ్యతలో రాజీపడకుండా రుచికరమైన వంటకాలను వడ్డించనుంది. తద్వారా.. సంస్థ ఆదాయం పెంచుకోవడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్నారు. మెనూ, ధరలు ఇంకా ఖరారు కానప్పటికీ, సరసమైన ధరలకు పరిమితమైన వంటకాలతో వీటిని రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ క్యాంటీన్లలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తే మోనూని మరింత విస్తరింప చేసే ఆలోచనలో ఉన్నారని అధికారులు అంటున్నారు. ఈ క్యాంటీన్లలో నాణ్యమైన, తాజా మాంసం వినియోగదారులకు అందేలా చెంగిచెర్లలోని ప్రభుత్వ కబేళా నుంచి మటన్ ను కొనుగోలు చేస్తారు. ఇక ఫెడరేషన్ ఇప్పటికే ఒప్పంద పద్ధతిలో చెఫ్ లను నియమించుకోగా.. హైదరాబాద్ క్యాంటీన్ల నుండి వినియోగదారుల స్పందన ఆధారంగా హైదరాబాద్ అంతటా, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.