Tirupati Laddu: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తాటి ఆకు బుట్టలో లడ్డూ ప్రసాదం పంపిణీ!

Tirupati Laddu: మన తెలుగు వారికి తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. వెంకన్న భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి చాలా డిమాండ్ ఉంటుంది. 307 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు. టీటీడీ కూడా లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తోంది. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తూ.. రుచి, శుచిలో ఎక్కడా రాజీపడకుండా చేస్తారు.
అంతటి ప్రాముఖ్యత ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ ఈ మధ్య కాలంలోనే పలు నిర్ణయాలు తీసుకోగా తాజగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం అమలుకు సిద్దం అవుతోంది. ప్రకృతి పరిరక్షణతో పాటు సంప్రదాయ వృత్తులకు చేయూత అందించే విధంగా తాజాగా ఈ చర్యలు ప్రారంభించింది. తాజాగా తాటాకు బుట్టలను లడ్డూ విక్రయా కేంద్రాల్లో బక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
దీనికి సంబంధించి ఇప్పటికే పలు రకాల బుట్టలను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రకృతికి మేలు చేయటంతో పాటుగా పలువురికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ వేత్త విజయరామ్ సహకారంతో ఈ బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇది అమలైతే ఇకపై శ్రీవారి లడ్డు తాటి ఆకు బట్టలలో పంపిణీ జరగనుంది.
కాగా, ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమలలో లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి లడ్డూ కేంద్రాల పెంపుతో పాటుగా రూ.50కోట్లతో కొత్తగా అత్యాధునిక యంత్ర వ్యవస్థ అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వస్తున్న ఈ అధునాత యంత్రాలు అందుబాటులోకి వస్తే బూందీ తయారీకి ఇక స్టవ్‌ల అవసరం ఉండదు. దీంతో పాటు రోజుకు ఆరు లక్షల లడ్డూల తయారీకి అవకాశం ఉంటుంది.