Dachepalli Murder: అనుమానం.. స్నేహితుడిని చంపి గొడ్డలితో ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి నిప్పు!

Dachepalli Murder: చిన్న అనుమానం చాలు బంగారం లాంటి జీవితాలు కూడా బుగ్గిపాలవ్వడానికి. ఇక, భార్య భర్తల మధ్య అనుమానం మొదలైతే.. అది ఎంతటి ఉపద్రవానికైనా దారితీస్తుందని ఎన్నో ఘటనలు చూశాం. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. తన స్నేహితుడిని చంపి గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘోరం పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగింది.
గరికపాటి కోటేశ్వరరావు అనే వ్యక్తిని అతని సహోద్యోగి, స్నేహితుడైన సైదులు హత్య చేసి, ఆపై ముక్కలుగా కోసి తగలబెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా మంటలు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగానే కోటేశ్వరరావు మృతదేహం మంటల్లో తగలబడుతోంది. ప్రాథమిక విచారణలో భాగంగా సైదులు హత్య చేసి.. పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు గుర్తించారు.
అసలు వివరాలలోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోటేశ్వరరావు, సైదులు నగర పంచాయతీ ఆఫీసులో పంప్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. అయితే సైదులు.. కోటేశ్వరరావును నీతో మాట్లాడాలంటూ ఊరి చివరకు పిలిచి దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆ శవాన్ని గొడ్డలితో నరికి ముక్కలుగా చేసి గోనే సంచులో వేసుకున్న సైదులు.. తన పొలానికి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి నిప్పటించాడు.
హత్య జరిగిన సమయం నుండే ఊరంతా గోల కావడంతో ఈ విషయం పోలీసులకు చేరింది. అయితే, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి కోటేశ్వరరావు మృతదేహం ముక్కలు తగలబడుతున్నాయి. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో సైదులుతో పాటు మరి కొంత మంది ప్రమేయం కూడా ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.