Telangana BJP: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ ఇష్యూ.. బీజేపీ నిరసన దీక్ష.. బండి సంజయ్ అరెస్ట్!

Kaburulu

Kaburulu Desk

March 17, 2023 | 03:08 PM

Telangana BJP: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ ఇష్యూ.. బీజేపీ నిరసన దీక్ష.. బండి సంజయ్ అరెస్ట్!

Telangana BJP: తెలంగాణలో టీఎస్పీపీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతుంది. మొదట టౌన్ ప్లానింగ్ పేపర్ లీకైందనే అనుమానంతో టీఎస్పీపీస్సీ పోలీసులకు కేసు నమోదు చేసింది. అయితే, పోలీసుల దర్యాప్తులో ఏఈ పేపర్ లీకైనట్లు తేల్చారు. తర్వాత ఈ కేసును సిట్ కు అప్పగించగా.. టీఎస్పీఎస్సీ నుంచి మొత్తం 5 పేపర్లు లీకైనట్లు సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఉద్యోగ ప‌రీక్ష ప‌త్రాలు లీక్ కావ‌డం ప‌ట్ల విద్యార్ధులు, నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పేప‌ర్ లీకేజ్ బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు.

బండితోపాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ నేతలను తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు చుట్టుముట్టడంతో గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. పేపర్ లీకేజ్ ఇష్యూలో అంతా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనికోసం పోరాడుతున్న తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇళ్లల్లోకి వెళ్లి మరీ యువ మోర్కా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. నీళ్లల్లో స్కాం.. నిధుల్లో స్కాం.. నియామకాల్లో స్కాం.. ఇదే కేసీఆర్ పాలనలో కొనసాగుతోందని ఆరోపించారు సంజయ్. కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే పేపర్ లీకేజ్ అయిందని ఆరోపించిన సంజయ్.. గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఇష్యూలో, ధరణిలో కూడా కేటీఆర్ హస్తముందన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా పట్టించుకోకుండా.. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే ఆమె కోసం ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్లడమేంటని ప్రశ్నించారు.