TTD Parakamani: తిరుమలలో నగదు లెక్కించే స్థలంగా పేరొందిన ‘పరాకామణి’ యొక్క చరిత్ర తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 11:08 PM

TTD Parakamani: తిరుమలలో నగదు లెక్కించే స్థలంగా పేరొందిన ‘పరాకామణి’ యొక్క చరిత్ర తెలుసా…?

తిరుమల శ్రీనివాసుడి హుండీ నిత్యం కానుకలతో కళకళలాడుతుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడి దాకా తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు. ఈ హుండీనే కొప్పెర అని కూడా అంటారు. శ్రీనివాసుడికి ఆయన మామగారు ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల దాకా అన్నీ హుండీ లోనే సమర్పిస్తారు. మరి ఇలా సమర్పించిన బహుమతులను ఎక్కడ లెక్కిస్తారో తెలుసుకున్నారా…? అదే పరాకామణి మరి ఈ పరాకామణి విశేషాలేమిటో ఇపుడు తెలుసుకుందాం.

శ్రీవారి కొప్పెర లేదా హుండీగా పరిగణించే గంగాళం కానుకలతో నిండిన తర్వాత లెక్కింపు కోసం పరకామణికి చేర్చుతారు. ఈ గంగాళాలను విజిలెన్స్, ఆలయ అధికారులు, బొక్కసం సిబ్బంది సమక్షంలో తెరిచి లెక్కిస్తారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయల దాకా హుండీ ఆదాయం సమకూరుతోంది. కట్టుదిట్టమైన నిఘా నడుమ హుండీ లెక్కింపు సాగుతుంది. చిల్లర నాణేలు, స్వదేశీ, విదేశీ నోట్లు, పురాతన నాణేలు, ఆభరణాలు, ముడుపులు, వస్తువులు, విలువైన పత్రాలు, కోర్కెల చిట్టాలు శుభలేఖలు, విజిటింగ్ కార్డులు కలకండ బియ్యం పసుపు…ఇలా రకరకాల కానుకలు హుండీకి చేరుతున్నాయి.. 1965 వరకు హుండీ లెక్కింపు బంగారు వాకిలి వద్దే జరిగేది. ఆ తర్వాత కానుకలు రావడం పెరగడంతో హుండీ లెక్కింపునకు ఆలయ ప్రాగణంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

పరకామణి విధుల్లో ఉండే సిబ్బంది పలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 2012 ఆగస్టు 20న పరకామణి సేవను టీటీడీ ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్‌ అయినవారు పరకామణిలో స్వచ్ఛంద సేవలను అందించేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. దీనికోసం ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకునే వీలుంది.