TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త… నిత్యకైంకర్యాలకు ఉపయోగించే అభిషేక పదార్థాలు సొంతంగా తయారు…!.!

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 09:41 PM

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త… నిత్యకైంకర్యాలకు ఉపయోగించే అభిషేక పదార్థాలు సొంతంగా తయారు…!.!

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ తయారు చేస్తున్న అగర బత్తీల ఉత్పత్తిని డిమాండ్ కు తగినట్లుగా పెంచే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్వీ గోశాలలో నిర్మించిన ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్ ను శుక్రవారం టీటీడీ ‌చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వఛ్చమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం దేశవాళీ గోవుల పెంపకం, దేశవాళీ గో జాతులను అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు తయారుచేసి వాటిని అమలు చేయడం జరిగింది. లేగ దూడల పెంపకం, గోవుల పెరుగుదల, వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, నాణ్యమైన పాల ఉత్పత్తికి మనం గోవులకు అందించే మేతకు అవినాభవ సంబంధం ఉంటుంది.

ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి, దేశవాళీ గోసంతతిని మరింత అభివృద్ధి చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన న్యూటెక్‌ బయోసైన్సెస్‌ సంస్థతో మూడు రకాల ఫార్ములాలతో కల్తీ లేని నాణ్యమైన పశువుల దాణా సొంతంగా తయారు చేసుకోవడానికి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఇందుకోసం రూ.11 కోట్లతో టిటిడి సొంతంగా ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ నిర్మించుకుంది.ఇందులో దాత ఒకరు రూ 2కోట్లు విరాళం అందించారు. ఈ ప్లాంట్‌లో శుక్రవారం(మార్చి 31 నుంచి) నుండే దాణా ఉత్పత్తి జరుగుతుంది.