Chaganti Koteswara Rao: టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి!

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 09:35 PM

Chaganti Koteswara Rao: టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి!

Chaganti Koteswara Rao: టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి జనవరిలో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వివిధ పారాయణాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావును ఎంచుకున్నట్లు కమిటీ సూచించిందని ఆనాడు సుబ్బారెడ్డి వెల్లడించారు.

అయితే, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. ఒక రకంగా ఇది ఏపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామమే. పారాయణం కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా చాగంటి నియామకం చేపట్టినా ఆయన మాత్రం సలహాదారు పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, వెంకటేశ్వరస్వామి తన ఊపిరి అని.. టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల చాగంటి సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తనను కలిసిన చాగంటి సీఎం జగన్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ కూడా అందజేశారు. ఆ సమయంలో చాగంటి వెంట శాంతా బయోటెక్ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ వర ప్రసాద్‌ రెడ్డి ఉన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వర రావు ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో ఉన్న గోశాలను కూడా సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చాగంటి గోశాలను ఏర్పాటు చేయడం అత్యుత్తమ నిర్ణయమని సీఎంను ప్రశంసించారు. గోశాల అద్భుతంగా నిర్వహిస్తున్నారని కూడా కొనియాడారు. అయితే, ఇంతలోనే ఏమైందో కానీ.. అంతకు ముందే ఆయనను గౌరవంగా నియమించిన సలహాదారు పదవిని చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఇది ఏపీ ప్రభుత్వ వర్గాలతో పాటు టీటీడీ పాలక మండలిలో హాట్ టాపిక్ గా మారింది.