BRS-BJP: పొలిటికల్ పోస్టర్ల వార్.. మొన్న బీజేపీకి వ్యతిరేకంగా.. నేడు బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా!

Kaburulu

Kaburulu Desk

March 18, 2023 | 01:05 PM

BRS-BJP: పొలిటికల్ పోస్టర్ల వార్.. మొన్న బీజేపీకి వ్యతిరేకంగా.. నేడు బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా!

BRS-BJP: హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం పీక్స్ కు చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పోస్టర్ల యుద్ధం తెలంగాణ రాజకీయాలలో కాక పుట్టిస్తుంది. ఆ మధ్య కొద్ది రోజుల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్లు బీఆర్ఎస్ నేతల పనేనని రాజకీయ వర్గాలు ఖరారు చేసుకున్నాయి. దీనిపై అప్పుడు బీజేపీ నేతలు కూడా గరంగరం అయ్యారు. అదలా ఉండగానే ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి.

కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు అతికించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో అనూహ్యంగా ఇప్పుడు పలువురి అరెస్టులతో ఈడీ సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే కీలక వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ కాగా.. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి.. తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత సన్నిహితులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.

రేపో మాపో ఎమ్మెల్సీ కవితను కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. బీజేపీ నేతలు బహిరంగంగా కవిత అరెస్ట్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వివాదం తలెత్తుతోంది. ఈ తరుణంలో ఇరు పార్టీలు పోస్టర్లు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పై స్థాయి నేతలే ఇలా రోడెక్కి రాజకీయాలు చేస్తున్నారా? లేక కింది స్థాయి నేతలే ఈ పనులు చేయిస్తున్నారో తెలియదు కానీ తెలంగాణ రాజకీయాలు మాత్రం పోస్టర్లతో మోతెక్కుతున్నాయి.

కేసీఆర్ ఫిలిమ్స్.. కల్వకుంట దొంగల ముఠా అనే టైటిల్ తో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్ అని సినిమా పోస్టర్ లా అతికించిన ఈ పోస్టర్లు సంచలనంగా మారాయి. మరి దీనిపై బీఆర్ఎస్ నేతల విమర్శలు ఎలా ఉంటాయో.. బీజేపీ నేతలు కౌంటర్లు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.